ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, ప్రగతి భవన్ లో నిన్న జరిగిన “దళిత సాధికారత” మీటింగ్ కు అన్నీ పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్ళొద్దని నిర్ణయించుకున్నా కూడా బిజెపి నుండి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మీద పార్టీ నుండి కాస్త విమర్శలు వస్తున్న నేపధ్యంలో మోత్కుపల్లి నర్సింహులు ఒక్కసారిగా బగ్గుమన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాకు స్వయంగా ఫోన్ చేసి రండి అన్నా, దళితుల కోసం మీ సూచనలు ఇవ్వండి అని పిలిచారు, ఈ విషయం నేను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అన్నారు. నేను ఆరు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిని, ఏ వర్గాలకోసం అయితే మనం రాజకీయాల్లో ఉన్నామో, ఆ వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన మీటింగ్ కి నేను వెళ్లడం తప్పా అని మండిపడ్డారు. దళితులకు 10లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం, దీన్ని మేం స్వాగతిస్తున్నాం అని అన్నారు. దళితుల కోసం ఇలాంటి మంచి నిర్ణయం ఏ సీఎం తీసుకోలేదు, అది ఒక్క కేసీఆర్ కే సాధ్యమైంది, కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. నేను కానీ వెల్లకపోయి ఉంటే, బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని ముద్ర పడి ఉండేది, నేను మీటింగ్ కి వెళ్లి పార్టీని కపాడాను అని తెలియజేశారు.