త్రిపుర రాష్ట్రంలో వెదురు ఉత్పత్తుల అధ్యయన పర్యటన పూర్తి
వెదురు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే విధానం అధ్యయనానికి రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్న నేతృత్వంలోని ప్రత్యేకబృందం చేపట్టిన త్రిపుర పర్యటన బుధవారం సాయంత్రం ముగిసింది. ఆదివారం నుంచి మూడురోజులపాటు త్రిపుర రాష్ట్రంలో పర్యటించింది. వెదురు పరిశ్రమతో ఉపాధి కల్పన మార్గాలను తెలుసుకున్నది. పర్యటనలో మంత్రి జోగురామన్నతోపాటు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సీఈవో అలోక్‌కుమార్, అటవీశాఖ పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు. వెదురు ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాలపై బృందం వివరాలను తెలుసుకున్నది. బోధజంగ్‌నగర్‌లోని త్రిపుర బాంబూ మిషన్ పారిశ్రామికవాడను సందర్శించి వెదురు ఉత్పత్తుల తయారీకి అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది. తెలంగాణకు చెందిన త్రిపుర రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి నాగరాజు బాంబూ మిషన్ లక్ష్యాలను మంత్రికి వివరించారు.
తెలంగాణలో మేదరులకు వెదురు ఉత్పత్తులపై శిక్షణనివ్వడానికి నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపాలని మంత్రి జోగురామన్న.. నాగరాజును కోరారు. త్వరలో ప్రత్యేక బృందాన్ని పంపుతామని నాగరాజు హామీ ఇచ్చారు. పర్యటనలో మంత్రి బృందం త్రిపుర వెదురు అడవులను, రబ్బరు ఉత్పత్తులను, త్రిపుర హస్తకళాకేంద్రాన్ని, బంగ్లాదేశ్ సరిహద్దులలోని వెదురు క్షేత్రాన్ని సందర్శించింది. త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్‌తోపాటు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి మేనార్ జమాతియాతో జోగురామన్న భేటీ అయ్యారు. వెదురు ఉత్పత్తుల తయారీకి పరస్పర సహాయ సహకారాలను అందించడానికి త్రిపుర సీఎం అంగీకరించారు. త్వరలోనే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు జోగురామన్న వివరించారు. తెలంగాణలో మేదరులకు ఆధునిక యంత్రాలను సమకూర్చి, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ పర్యటనలో మేదర సంఘం ప్రతినిధులు వెంకటరాములు, బాలరాజు, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.