టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ పంపిన ప్రతిపాదనలకు బైట్‌డ్యాన్స్ సానుకూలంగా స్పందించిందని, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇండో-అమెరికన్ సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ కంపెనీ తన బ్లాగ్‌లో కీలక విషయాలను వెల్లడించింది.
అదే విధంగా యూఎస్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సైతం టిక్‌టాక్ నిర్వహణ బాధ్యతలు సొంతం చేసుకునే యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించి ఇతర అమెరికా పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని కూడా తాము ఆహ్వానించనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం వల్ల టిక్‌టాక్ అమెరికా యూజర్లకు ఎలాంటి భంగం వాటిల్లబోదని, ఎవరితోనూ తాము ఈ సమాచారం పంచుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే ఈ యాప్‌లో యూజర్ల వ్యక్తిగత డేటా ఇతర దేశాలకు చేరి ఉంటే అన్ని సర్వర్ల నుంచి దానిని డెలిట్ చేయిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచ స్థాయి అత్యుత్తమ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తామని, యూజర్లు, ప్రభుత్వానికి పారదర్శకంగా అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొంది.
అంతేగాకుండా మైక్రోసాఫ్ట్ తాజా ఒప్పందంతో అమెరికా ఖజానాకు భారీ స్థాయిలో మేలు చేకూరనుందని తెలిపింది. కాగా చైనాతో వాణిజ్య, దౌత్యపరమైన విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్ కంపెనీలపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.