అనధికార ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు(జీవో 135)ను జారీ చేసింది. ఇటీవల విడుదలైన జీవో-131లో నాలుగు శ్లాబులే ఉండేవి. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బుధవారం శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ‘‘2015లో ఎల్‌ఆర్‌ఎ్‌స కు జారీ చేసిన జీవో 151ను యథాతథంగా తెస్తాం. ఒకవేళ ప్లాట్లను 2010లో కొని ఉంటే.. అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా 14% చార్జీ చెల్లిస్తే చాలు.
అదేజరిగితే చార్జీలు 50-60% తగ్గుతాయి. సమస్య పరిష్కారమవుతంది. సవరణ జీవోను గురువారమే జారీ చేస్తాం’’ అన్నారు. గడువు పొడిగించాలన్న సభ్యుల సూచనపై.. 6 నెలల సమయం ఉంటుందన్నారు. కేటీఆర్ ప్రకటన మేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సవరణ ఉత్తర్వులు విడుదల చేశారు. 2015 నాటి ఉత్తర్వులో ఆ ఏడాది అక్టోబరు 28 నాటి మార్కెట్ విలువ ప్రకారం చార్జీలకు 7 శ్లాబులున్నాయి.
తాజా ఉత్తర్వుల్లో ఈ ఏడాది ఆగస్టు 26 నాటి మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని 7శ్లాబులను ప్రకటించారు. ఖాళీ స్థలం(ఓపెన్ స్పేస్) 10% కూడా లేని ప్లాట్లకు 14% చార్జీ విధించడంలో రిజిస్ట్రేషన్ నాటి విలువను పరిగణనలోకి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. పైగా.. నాలా చార్జీలు ఎల్‌ఆర్‌ఎ్‌సలో భాగమేనంటూ ఉపశమనం కలిగించా రు. అంటే.. ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లిస్తే ప్రత్యేకించి నాలా చార్జీలు ఉండవు. అయితే.. అనధికారిక లే-అవుట్లలో నిబంధనల ప్రకారం ఓపెన్ స్పేస్ వదిలినవే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. క్రమబద్ధీకరణ శ్లాబులను రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఉంటే దరఖాస్తుదారులకు భారీ ఉపశమనం కలిగే తదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.