ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.
విస్తృత చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది. తలాక్ బిల్లుపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. అసదుద్దీన్ సవరణ ప్రతిపాదనలకు మద్దతుగా 2, వ్యతిరేకంగా 241 మంది సభ్యులు ఓటు వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ .. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేడీ ఎంపీ బి.హరి, కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్, సీపీఎం సభ్యుడు సంపత్ ఇచ్చిన సవరణ ప్రతిపాదనలపై ఓటింగ్ నిర్వహించారు. సవరణ ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ… ముస్లిం మహిళల కోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం మహిళల హక్కుల కోసం అందరూ ఏకం కాకవాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, మానవత్వానికి సంబంధించినదన్నారు.