దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్ పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను కొనసాగించాలని కోరింది. ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ నుంచి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె. కేశవరావు, లోక్ సభపక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ వైఖరిని డాక్టర్ కేశవరావు ప్రధాన మంత్రికి స్పష్టంగా తెలియచేశారు.
భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా వద్దా అన్నది మన మెదళ్ళలో ఉంది. కానీ నేను మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుతున్నాను. లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం. ఎక్కువ వైద్య సదుపాయాలు లేని గ్రామాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి చేయి దాటి పోతుంది. ముందు ఈ బాధ నుండి విముక్తి లభిస్తే తరువాత ఏమైనా చేసుకోవచ్చు. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందనే విషయం మాకూ తెలుసు. కానీ మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధిని ప్రాధాన్యంశంగా చూడవద్దు అని కేశవరావు కోరారు.