భారత్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా మంది రోగుల ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ కష్టాలను చూసిన పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
గల్ఫ్ దేశం కువైట్ భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. కువైట్ నుంచి భారత్ కు వైద్య పరికరాలు పంపింది. 282 ఆక్సిజన్ సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లతో పాటు వెంటిలేటర్లు, వైద్య పరికరాలను పంపింది.
కువైట్ సాయానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. స్పెయిన్ 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు సరఫరా చేస్తుండగా.. డెన్మార్క్ 53 వెంటిలేటర్లు పంపుతోంది. నెదర్లాండ్స్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల యాంటీవైరల్ ఔషధాలు, రెమ్డెసివిర్ డ్రగ్, 449 వెంటిలేటర్లు భారత్‌కు పంపిపస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. 15 వేల యాంటీవైరస్ డ్రగ్స్, 516 వెంటిలేటర్లను భారత్‌కు పంపిస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది.