విశ్వాసపరీక్ష నెగ్గిన కుమారస్వామి ప్రభుత్వం
విశ్వాసపరీక్షలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సునాయాసంగా నెగ్గింది. విధానసభ (అసెంబ్లీ)లో శుక్రవారం నిర్వహించిన బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం పోటీలేకుండానే గెలిచింది. కాంగ్రెస్-జేడీఎస్‌లది అపవిత్ర కలయికగా పేర్కొంటూ.. బీజేపీ సభ నుంచి వాకౌట్ చేయడంతో విశ్వాసపరీక్ష లాంఛనప్రాయమే అయ్యింది. అనంతరం మూజువాణి ఓటుతో ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో పది రోజులుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన కర్ణాటక ఎన్నికల ఘట్టం సమాప్తమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి ప్రభుత్వ ఏర్పాటుపై అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 224మంది సభ్యులకుగాను అసెంబ్లీలో ప్రస్తుతం 221మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 112మంది సభ్యుల మద్దతు అవసరం. 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, బలాన్ని నిరూపించుకోలేక మూడురోజులకే పడిపోయింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి అవకాశం వచ్చింది. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి రెండురోజుల్లోనే తన బలాన్ని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌కు 78మంది, జేడీఎస్‌కు 36, బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీరితోపాటు కేపీజేపీ ఎమ్మెల్యే ఒకరు, స్వతంత్ర సభ్యుడు ఒకరు కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. దీంతో 117 సభ్యుల మద్దతును సంకీర్ణ ప్రభుత్వం నిరూపించుకోగలిగింది.