ప్రగతి భవన్: ప్రస్తుత వర్షాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశించారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు పలు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ మేరకు జీహెచ్ఎంసీలో ఉన్న వివిధ విభాగాల మధ్య సమన్వయంతో ముందుకు పోయేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. నాలాల అభివృద్ది కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీకి తగిన పరిపాలనా అనుమతులు ఇచ్చామని, ఈ మేరకు నాలాలపైన క్యాపింగ్ లేదా ఫెన్సింగ్ వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ జోన్లలో ఉన్న నాలాల ఫెన్సింగ్ కార్యక్రమానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాలాల అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను జీహెచ్ఎంసీ అందించడం ద్వారా ఎస్.యన్.డి.పి ని (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలాలకు సంబంధించిన కార్యక్రమాలను మేయర్ మరియు కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిపిన తవ్వకాల(ముఖ్యంగా రోడ్ల ) వద్ద అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాలలో భాగస్వాములైన వర్కింగ్ ఎజెన్సీలు, శాఖలకు ప్రత్యేకంగా ఈమేరకు అదేశాలు జారీ చేయాలన్నారు.
ఈ వర్షాకాలం సందర్భంగా నగరంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హెల్త్, శానిటేషన్ విభాగాలు కలిసి పని చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో పారిశుద్ధ్యానికి, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, యాంటీ లార్వాల్ వంటి కార్యక్రమాలను ఎంటమాలజీ విభాగం మరింత పెంచాలన్నారు.
ఈ సమీక్ష సమావేశం సందర్భంగా జీహెచ్ఎంసీలో అమలవుతున్న టీఎస్- బిపాస్ తోపాటు, ఎస్ఆర్డిపి వంటి ఇతర కార్యక్రమాలు పైన కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమీషనర్, జోనల్ కమీషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.