సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న కీకీ ఛాలెంజ్. రన్నింగ్‌లో ఉన్న కారు నుంచి రోడ్డుపై దిగి డ్యాన్స్ చేసి, తిరిగి అదే కారులోకి దూకి మరికొందరికి ఛాలెంజ్ విసరటం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా. కొందరు మాత్రం దాన్ని వీడలేకపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు యువ రైతులు కూడా తమ వంతుగా ఈ ఛాలెంజ్‌లో పాలు పంచుకున్నారు. పోలం దున్నుతూ చేసిన ఈ ఛాలెంజ్ తాలూకు వీడియో హిల్లేరియస్‌గా ఉండటమే కాదు. వాట్సాప్ గ్రూప్‌ల్లో తెగ మారుమోగిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది కూడా.
తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనీల్ కుమార్(24), పిల్లి తిరుపతి(28). కీకీ ఛాలెంజ్‌కు సరదాగా యత్నించాలని డిసైడ్ అయ్యారు. వరినాట్ల సందర్భంగా ఎద్దులతో పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ ‘ఇట్స్ మై ఫీలింగ్స్’ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న పాట.. దానికి దేశీ టచ్.. ఇంకేముంది? ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘మై విలేజ్ షో’ ఫేమ్ శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్ లో ఈ నెల 1న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.6 కోట్ల మంది చూశారు.