తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితుల పై ప్రగతిభవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి, కరోనా ప్రత్యేకాధికారి శ్రీ రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, సీఎం ఓఎస్డీ శ్రీ తాడూరి గంగాధర్, మెడికల్ కార్పోరేషన్ ఎండీ శ్రీ కట్టా చంద్రశేఖర్ రెడ్డి, వైద్యవిద్యా సంచాలకులు శ్రీ కె. రమేశ్ రెడ్డి, హెల్త్ డైరక్టర్ శ్రీ జి. శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ విసీ శ్రీ బి. కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరియైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తున్నది. దాన్ని కట్టడి చేయాలన్నా, ముందస్తుగా నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైంది. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంత వరకు విస్తరిస్తదో తెలియట్లేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అయితది. కరోనా రోగ కారణం దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి వున్నది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరమున్నది. కరోనా నియంత్రణకోసం నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ ల పేరుతో వేవ్ ల రూపంలో వస్తున్న దశలవారీ కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రజలను కరోనా భారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలె.’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, కరోనా నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలన్నారు. కరోనా నియంత్రణ కోసం చేయదగ్గ పని ఏమిటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేసి సఫలీకృతం కావాలని సీఎం అన్నారు. ప్రజల్లో తప్పనిసరిగా మాస్కులను ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికోసం ప్రభుత్వంతో కలిసిరావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్య పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తద్వారా కూడా కరోనా కట్టడి చేయగలిగామని సీఎం అన్నారు