యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’’ అని సీఎం వాఖ్యానించారు.