హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించిన కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయాలు:
రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.
కాగా కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
గత కేబినెట్ సమావేశం ఆదేశాలమేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజకవర్గాల్లో లాక్ డౌన్ ను ప్రస్తుతం కొనసాగిస్తున్న సమయాన్ని అనుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు పైన తెలిపిన 7 నియోజకవర్గాల్లో లాక్ డౌన్ యథాతథ స్థితినే (ఉదయం 6 గంటలనుంచి 1 గంట వరకు సడలింపు మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో వైద్యం ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు:
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖానాలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. రేపటినుంచి ప్రారంభించబోతున్న 19 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట,మహబూబ్ నగర్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో, జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలకు సరిపడా బ్లడ్ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
వరంగల్ లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్య సేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎం.డీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నిషియన్, డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన దవాఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలకు ఆవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐసీయూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్.ఎన్.సీ.యూ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిషలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని నిర్ణయయించింది.
రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి శ్రీ హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు శ్రీ జి. జగదీశ్ రెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెల్లి అధ్యయనం చేసి రావాలని సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.
వ్యవసాయానికి సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు:
వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద క్యాబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది.
2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది.
చేపలు, గొర్రెల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది.
హైదరాబాద్ జిల్లా మినహా, పాత తొమ్మిది జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీ.ఎస్.ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
పౌర సరఫరాలకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు:
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి శ్రీ గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
డిజిటల్ సర్వే నిర్ణయాలు:
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని, ఇది ఇప్పటికే సమస్యలేవీ లేకుండా పరిష్కారమై ప్రక్రియఅని, రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోర్ చట్టం- 2020 ప్రకారం, రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదయినాయని కేబినెట్ కు రెవిన్యూ శాఖ వివరించింది. రైతుల కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా వుండే హద్దురాల్లు, కాయితాలమీద వుండే టీఫన్ కక్షతో కూడిన కొలతలు ఇకనుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని, రాల్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుంది.
పీఆర్సీ కి కేబినెట్ ఆమోదం:
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ (9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.