కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
సామాజిక న్యాయం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ తో సాధ్యం
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అది తప్పకుండా అమలు చేస్తుందని.. గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు. తుక్కుగూడలో గతంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటించారు.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు.
తాజాగా మరోసారి తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ హామీలు ఇవ్వడం ఆనందంగా ఉందన్న కుమారస్వామి.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చడం హర్షనీయమని అన్నారు. నిన్న జరిగిన జన జాతర సభలో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కీలక అంశాలు చేర్చడం అభినందనీయమని కొనియాడారు.
కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేబడతామని తెలపడం శుభపరిణామంగా భావిస్తున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లు 50% పరిమితిని ఎత్తివేస్తామని.. మరో 50% పెంచుతామని.. అదీగాక మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పిస్తామని.. ఇలా పలు కీలకమైన అంశాలు మేనిఫెస్టోలో జతపరచినందుకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియచేసారు.
తాను బతికున్నంత కాలం తెలంగాణకు అండగా నిలబడతానని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రజల కోసం తాను సిపాయిలా ఢిల్లీలో ఉంటానని తెలపడం ప్రజలకు భరోసా ఇచ్చే అంశంగా కుమారస్వామి పరిగణించారు.. అదేవిధంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఏడాదికి రూ.1 లక్ష వచ్చేలా చేస్తామని.. నెలకు రూ.8,500తో ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ వెల్లడించడం.. నిరుద్యోగ భవిష్యత్తుకు బలమైన అండగా పేర్కొన్నారు..
ఈ హామీ కారణంగా ఎంతో మంది యువత బాగుపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే తొంభై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించినట్లు తెలిపారు.. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికుల్లో దళితులు, ఆదివాసీలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యలు వింటుంటే పేదల గురించి రాహుల్ గాంధీ చెబుతోంది నిజాలేనని.. అందుకే పేదల పక్షాన నిలిచే కాంగ్రెస్ కు జాతీయ బీసీ దళ్ మరియు పలు బీసీ సంఘాలు, కుల సంఘాలు దేశస్థాయిలో మద్దతు తప్పకుండా ఇస్తుందని దుండ్ర కుమారస్వామి వెల్లడించారు..
మరోవైపు గడిచిన 10 ఏళ్ల కాలంలో బీసీల ఆకాంక్షలను నెరవేర్చలేదని బీసీల రిజర్వేషన్లను తొలగించే కుట్రలు బీజేపీ చేస్తుందని విమర్శించిన ఆయన.. బీసీలను విస్మరించిన బీజేపీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు..