తెలంగాణ రాష్ట్రంలో ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బయల్దేరిన పవన్ తల్లాడ వద్ద అభిమానులకు తన కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ కాన్వాయ్‌పై చెప్పును విసిరాడు.
దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం పవన్ తల్లాడ నుంచి ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. నేరుగా ఎంబీ గార్డెన్‌కు వెళ్లిన పవన్ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పార్టీ ముఖ్య సమన్వయ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎంబీ గార్డెన్‌లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అదుపు చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా తయారైంది.
పవన్ సభ ప్రాంగణానికి చేరుకోగానే రెచ్చిపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ రావడంతో మీడియా సిబ్బంది గాయపడ్డారు. వీడియో జర్నలిస్టుల కెమెరాలు విరిగిపోయాయి. సభా ప్రాంగణమైన ఎంబీ గార్డెన్‌లో కుర్చీలన్ని
విరిగిపోయాయి. పార్టీ అధినేత ఏం మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోని అభిమానులు.. వేదికపైకి దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పడంతో పవన్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించి వెళ్లిపోయారు.