ఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహంగా పిలువబడుతున్న జీశాట్-11 ప్రయో గం విజయవంతమైంది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహంగా పిలువబడుతున్న జీశాట్-11 ప్రయో గం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.07 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరో అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీశాట్-11ను ప్రయోగించారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియన్-5(వీఏ246) అంతరిక్ష వాహకనౌక జీశాట్-11ను తీసుకుని నింగికెగిరింది. 33నిమిషాల ప్రయాణం తర్వాత భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఏరియన్-5.. దీర్ఘవృత్తాకార భూమ్యానువర్తన పరివర్తన కక్ష్యలోకి.. దాని నుంచి భూస్థిర కక్ష్యలోకి జీశాట్-11ను విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఇస్రో ఇప్పటివరకు తయారు చేసిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. రూ.600 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ జీశాట్-11 బరువు 5,854 కిలోలు. జీశాట్-11 ఉపగ్రహ సామర్థ్యం.. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అన్ని కమ్యూనికేషన్ శాటిలైట్ల సామర్థ్యంతో సమానం. భారత్‌లోని అణువణువునూ ఇది ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకురానున్నది. మారుమూల ప్రాంతాలకు ఉపగ్రహ ఆధారిత అంతర్జాల సేవలను ఇది అందించనుంది. 15ఏండ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. మరోవైపు జీశాట్-11 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీ భారత శాస్త్రవేత్తలను అభినందించారు.