ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కొత్త మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. బుధవారం ఉత్తర ప్రదేశ్, న్యూఢిల్లీలలోని 17 చోట్ల నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, రాకెట్ లాంఛర్, ఆయుధ సామగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. హర్కత్ ఉల్ హర్బ్ ఈ ఇస్లామ్ పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్ భారతదేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) అలోక్ మిట్టల్ మీడియాకు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు జరిపేందుకు, రాజకీయ నేతలతోపాటు భద్రతా వ్యవస్థలపై దాడులు చేసేందుకు ఈ మాడ్యూల్ సభ్యులు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలోని సీలంపూర్, ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా, హాపూర్, మీరట్, లక్నోలలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.7.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, మెమరీ కార్డులతోపాటు దేశవాళీ రాకెట్ లాంఛర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమోట్ కంట్రోల్ ద్వారా, ఫిదాయీ దాడులు చేయాలని ఈ బృందం ప్రయత్నిస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ బృందం సభ్యులు విదేశీ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకుని, సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. విదేశీ ఏజెంట్ల వివరాలను రాబట్టవలసి ఉందని చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్నవారిలో ఓ సివిల్ ఇంజినీరు, మౌల్వీ, ఓ విద్యార్థి, ఆటో డ్రైవర్ ఉన్నట్లు వివరించారు. మౌల్వీ ముఫ్తీ సొహెయిల్ ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా నివాసి అని తెలిపారు. హర్కత్ ఉల్ హర్బ్ ఈ ఇస్లామ్ పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్‌కు సొహెయిల్ నాయకత్వం వహిస్తున్నాడన్నారు.