భారత్ లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన డీసీజీఐ వీజీ సోమానీ.. ఈ మేరకు రెండు టీకాల వినియోగానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తూ ఆమోదం తెలపాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
డీసీజీఐ ఆమోదంతో ఇండియాలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్‌లుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ నిలిచాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్‌లను రెండు డోసులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఈ రెండు టీకాలు పూర్తి సురక్షితమని తేలినట్లు డీసీజీఐ ఆదివారం ప్రకటించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని కూడా తెలిపింది.