ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తెచ్చే చర్యల్లో భాగం గా పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.41,000 కోట్ల మూలధన నిధులు (రీక్యాపిటలైజేషన్) సమకూర్చే ప్రతిపాదనను పార్లమెంట్ ముందు ప్రభుత్వం ఉంచింది. గతంలో 2018-19లో బ్యాంకులకు రూ.65,000 కోట్ల మూలధన నిధులను సమకూర్చాలని ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనతో ఇది రూ.1.06 లక్షల కోట్లకు చేరుతుంది. అనుకున్న దానిలో ఇప్పటి వరకూ సమకూర్చిన నిధులు పోగా.. రూ.83,000 కోట్ల నిధులు బ్యాంకులకు అందనున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో అందే ఈ నిధుల వల్ల బ్యాంకుల కనీస మూలధన నిష్పత్తి పెరగడంతోపాటు నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి తగ్గుతుంది. బాండ్లు ఇతర మార్గాల ద్వారా కూడా బ్యాంకులు భారీగా నిధులు సమీకరిస్తున్నాయి.
బ్యాంకులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ కోడ్ (ఐబీసీ)తో ఊపందుకున్న మొండి బకాయిల వసూళ్లు తదితర అంశాలు ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గడానికి దోహదం చేస్తున్నాయి. 2019, మార్చితో ముగిసే ఏడాది ప్రథమార్ధంలో పీఎస్‌బీల నిరర్థక ఆస్తులు రూ.23,860 కోట్ల మేరకు తగ్గాయి. ఇదే కాలంలో ఈ బ్యాంకులు రూ.60,713 కోట్ల రుణాలను రికవరీ చేశాయి. గత ఏడాది ఇదే కాలంలో రికవరీ చేసిన రూ.29,302 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా ఎక్కువ.