రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ వరం
భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూలవేతనాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 35749 మంది ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. కేవలం 100 రోజుల్లోనే భూరికార్డులను ప్రక్షాళన చేశారని ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు. 80 ఏళ్లుగా భూ రికార్డుల నిర్వహణ సరిగా లేదని, మార్పులను నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పారు. నిర్లక్ష్యం వల్ల భూరికార్డులు గందరగోళంగా మారాయని, పంట పెట్టుబడి పథకం అమలు కోసం.. భూ యజమానులు ఎవరో తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై స్పష్టత వచ్చిందని, వివాదాల్లో ఉన్నవి మినహా మిగిలిన భూముల ప్రక్షాళన పూర్తైందని సీఎం వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎలాంటి ఉపయోగం ఉంటుందో.. భూరికార్డుల ప్రక్షాళన నిరూపించిందన్నారు. కొత్త కలెక్టర్ల ప్రతిభకు ఇది గీటురాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.