మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది.
శనివారం వెల్లడైన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. హస్తం పార్టీ అధికారానికి మాత్రం దూరమైంది. గతంలో గోవాలో జరిగిందే ఈశాన్య రాష్ట్రంలోనూ పునరావృత్తమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ఎన్‌పీపీ నేత కొన్‌రాడ్ కే సంగ్మాను మేఘాలయ గవర్నర్ ఆహ్వానించారు.
ఎన్‌పీపీకి 19 స్థానాలు రాగా, బీజేపీ రెండు చోట్ల గెలుపొందింది. అత్యధికంగా 22 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నప్పటికీ.. బీజేపీ మద్దతుతో ఎన్‌పీపీ కూటమికి కూడా 22 స్థానాలు ఉన్నాయి. ఆరు చోట్ల గెలుపొందిన యూడీపీ కూడా ఎన్‌పీపీకి మద్దతునిచ్చింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కొన్‌రాడ్ సంగ్మాను ఆహ్వానించారు.
మార్చి 6న కొన్‌రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఎన్‌పీపీ సంకీర్ణానికి 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ తనను 34 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తున్నట్లు సంగ్మా చెప్పడం గమనార్హం. ఎన్‌పీపీ ఎన్డీయేలో భాగమైనప్పటికీ.. మేఘాలయ ఎన్నికల్లో మాత్రం విడిగా పోటీ చేసింది.