చేసింది తప్పు అయినా సమర్థించుకోవటం.. ఆపై ఆవేశంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన ఒక హైదరాబాద్ యువతి తీరు ఇప్పడు వైరల్ గా మారింది. ర్యాష్ గా డ్రైవ్ చేసిన ఆమె కారణంగా రోడ్డు మీద వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు టెర్రర్ కు గురి చేసిన ఆమె.. అంతే ఆగ్రహంతో తనను ప్రశ్నించిన వారిని కొట్టేసిన తీరు ఇప్పుడు సంచలమైంది.
గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం మధ్యాహ్నం బేగంపేట నుంచి ప్యారడైజ్ వెళ్లే దారిలో వోక్స్ వ్యాగన్ కారులో ప్రయాణిస్తున్న ఒక యువతి ర్యాష్ గా డ్రైవ్ చేసింది. పలువురు ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టేసిన ఆమెను ఒక ద్విచక్రవాహనదారుడు వెంబడించి ఆమెను ప్రశ్నించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. సదరు ద్విచక్ర వాహనదారుడ్ని చెంప ఛెళ్లుమనిపించటమే కాదు.. అతడిపై దాడికి ప్రయత్నించింది. ఇదే సమయంలో అటువైపు వెళుతున్న ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రామలింగరాజు ఆ యువతిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండ ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు యువతి ప్రయత్నించింది.
ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ చేశారు. యువతి కారు ఢీ కొట్టటంతో ప్రమాదానికి గురైన హరీశ్ ఓజా అనే ద్విచక్ర వాహనదారుడు ట్విట్టర్ లో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కమిషనరేట్.. ఫిర్యాదును బేగంపేట పోలీసులకు పంపారు.
యువతి దాడికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ లభించటంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ర్యాష్ గా డ్రైవ్ చేసిందన్న నేరంపై ఐపీసీ సెక్షన్ 279, 70బి సీపీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రోడ్డు మీద హల్ చల్ చేసిన యువతి సికింద్రాబాద్ సిక్ విలేజ్‌కు చెందిన లూబ్నాగా గుర్తించారు.