హైదరాబాద్ బోనాలు సకల జనహితాలు…. -డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు .
హైదరాబాదులో ఆషాడ మాసం నుండి ఆరంభమయ్యే బోనాల పర్వదినాలు ,అన్ని వర్గాల ప్రజల శ్రేయోదాయకాలు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ‘ప్రకృతిలో వచ్చే మార్పుల నేపథ్యంగా ప్రజలకు ఎలాంటి అంటురోగాలు, ఇబ్బందులు ఏర్పడకుండా వేడుకునే మహత్తరమైన సంప్రదాయం.. బోనం సమర్పించడం’ అని ఆయన పేర్కొన్నారు .తెలంగాణ సమాజంలో ఈ సనాతన సంప్రదాయం దైవీకమైనదని, ప్రకృతి నుండి స్వీకరించి ప్రజలు ఆచరించిరని ఆయన వివరించారు. ధర్మరక్షక సేన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కి 108 బోనాలను సమర్పించింది .ఆ సంస్థ అధ్యక్షుడు ఆవల అభిషేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలనం చేసి, తొలి బోనం ఎత్తారు. ఈ బోనాల కార్యక్రమం ప్రశాసన నగర్ నుండి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు ప్రదర్శనగా కొనసాగింది. అక్కడ అమ్మవారికి బోనాల సమర్పణ జరిగింది . ఈ కార్యక్రమంలో ధర్మరక్షక సేన అధ్యక్షుడు అవల అభిషేక్, ఆయన కుటుంబ సభ్యులు, మహిళా నాయకురాలు అనురాధ ,జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, నగరం నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ ‘అపర ఆదిపరాశక్తులైన నగరంలోని అమ్మవార్లను కొలుస్తూ, బోనం పండుగ బోనం సమర్పించడం అనేది తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక ,దైవిక సంప్రదాయంగా కొనసాగుతుందని’ ఆయన అన్నారు .ఇక్కడ జరుపుకునే పండుగలు అన్ని ప్రకృతి ఆరాధ్యమైనవని, ప్రకృతి మహిమాన్విత శక్తిని కొలిచేటివని అన్నారు. గోల్కొండ జగదాంబికా- చంద్రావతి, జనరల్ బజారు- మహంకాళి ,లాల్ దర్వాజా- సింహవాహిని, మీరాలం మండి- మహంకాళి, అక్కన్న మాదన్న- మహంకాళి ,చార్మినార్ -భాగ్యలక్ష్మి ,బల్కంపేట- ఎల్లమ్మ ,ట్యాంక్ బండ్- కట్ట మైసమ్మ, నగరమంతా వీధి ,వీధి వీధులలో వెలసిన అమ్మవార్లను ప్రార్థిస్తూ బోనం సమర్పించే ఆనవాయితీని ,సనాతనంగా నగరంలోని అక్కచెల్లెళ్ళు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు .ధర్మ రక్షక సేన కూడా ,అందరి ప్రజల శ్రేయస్సు నిమిత్తం 108 బోనాలు సమర్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధర్మ రక్షణ సేన అధ్యక్షుడు అభిషేక్ మాట్లాడుతూ ,పలు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా, ప్రతి ఏటా బోనం సమర్పిస్తున్నామని ఆయన తెలిపారు.జాతీయ బిసి దల్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ప్రజలు నిర్వహించుకోవాలని, ఇది ఒక మంచి సంప్రదాయం అని అన్నారు.