ఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం
యావత్తు దేశానికే హైదరాబాద్ నగరం ఐటి హబ్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సైతం ఐటిరంగ అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం జరిగిన ‘హైసియా’ (హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఐటి రంగంలో హైదరాబాద్ నగరం నిరంతర వృద్ధిని సాధిస్తూ ఉన్నదని, ప్రపంచపటంలో ఐటి రంగంలో హైదరాబాద్‌కు స్థానం లభించిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 55 వేల కోట్లుగా ఉన్నసాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఇప్పుడు రూ. 97 వేల కోట్లకు పెరిగాయని, ఇదే వృద్ధిరేటుతో మరో రెండేళ్ళలో ఇది రూ. 1.20 లక్షల కోట్లకు చేరుతుందని, రాష్ట్ర ప్రభుత్వ అంచనా కూడా అదే తీరులో ఉందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మౌలిక సౌకర్యాల రూపకల్పనతో పాటు పరిశ్రమల స్థాపనకు, ఐటి రంగంలో కొత్త యూనిట్లు నెలకొనేందుకు వీలుగా అనుకూల నిర్ణయాలను ప్రవేశపెట్టడం వలన పలు రంగాలు వృద్ధి చెందుతూ ఉన్నాయన్నారు. ఐటి రంగంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కూడా అద్భుతమని, అనేక మంది ఐటి నిపుణులకు, ఐటి పారిశ్రామికవేత్తలకు హబ్‌గా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ‘హైసియా’ కూడా అదే దిశగా ప్రయాణిస్తూ ఉన్నదని పేర్కొన్నారు. ఇంతకాలం బెంగళూరు, చెన్నయ్, పూణె నగరాలు మాత్రమే ఐటికి దేశంలో గుర్తింపుగా ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ నగరాల సరసన చేరిందని, ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి నిదర్శనమని అన్నారు.