తెలంగాణ భవన్ : తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేదరికం ఉంది. పేదరికం, సామాజిక వివక్ష ఇంకా దళితవాడల్లో ఉంది. దళితబంధు అంటే పుట్నాలు, పేలాలు పంచినట్టు కాదు. దళితులకు రూ.10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.
దళితబంధు కోసం హుజూరాబాద్‌నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. రైతుబంధు, మొదటి సింహగర్జన కూడా హుజూరాబాద్‌లోనే ప్రారంభించినట్లు తెలిపారు. రైతుబీమా కూడా కరీంనగర్‌లోనే ప్రారంభించినట్లు వెల్లడించారు. బాధ్యత ఉన్నవాళ్లు విమర్శిస్తారు గానీ తిట్ల జోలికి పోరన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లు ఎప్పటికీ ఉంటారన్నారు. గుడ్డి విమర్శలకు భయపడి నిర్మాణాత్మకంగా పనిచేసే వాళ్లు తమ ప్రస్తానాన్ని ఆపరని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆపద్భందు కింద రూ.50 వేలు ఇస్తే రూ.30 వేలు దళారీలే కొట్టేసేవారన్నారు. కాగా తమ ప్రభుత్వంలో లబ్దిదారులకు వందకు వందశాతం ప్రభుత్వ ఫలాలు అందుతున్నట్లు చెప్పారు.