రూ.4,39,765 కోట్ల పెట్టుబడులు ఏపీ భాగసామ్య సదస్సులో 734 ఒప్పందాలు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. ఈ సదస్సులో సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరుగుతాయని అంచనా వేయగా, 46 శాతం అధికంగా రూ.4,39,765 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సంయుక్త భాగస్వామ్యంతో విశాఖలోని హార్బర్‌పార్కులోని ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవగా, ముగింపు ఉత్సవంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పాటు జరిగిన పలు ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, ప్రభుత్వపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి అందరికీ వివరించి నిశ్చింతగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
మూడు రోజుల్లో మొత్తం 734 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ సాకారమైతే 11,02,125 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గూగుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ, వేదాంత వంటి అనేక పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. సోమవారం సదస్సు చివరి రోజు రూ.2,20,951 కోట్ల విలువైన 369 ఒప్పందాలు జరిగాయి.