- మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే : ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్
- – మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి జరిమానా, ఒక రోజు జైలు శిక్ష
- – రోడ్డు ప్రమాదాల నివారణకు క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
- – నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచన
నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని నల్లగొండ ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరిక్షణలలో పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. వీరందరినీ కోర్టులో హాజరు పర్చగా వారిలో ఏడుగురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్షతో పాటు ఒకరికి 1500 జరిమానా, మిగిలిన ఆరుగురికి వెయ్యి రూపాయల జరిమాన, జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు వివరించారు. మిగిలిన తొమ్మిది మందిలో ఒకరికి రెండు వేల రూపాయల జరిమాన, ఇద్దరికి 1500 రూపాయల చొప్పున, మిగిలిన వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా తమతో సహకరించాలని సిఐ శ్రీనివాస్ కోరారు.