తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌కు గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈటల శాఖను తనకు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ను కోరారు. దీంతో ఆరోగ్య శాఖను కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు . ఇప్పుడు కేసీఆర్ పరిధిలోకి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా మిగిలారు. ఈ నేపథ్యంలో ఈటలను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈటలపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు శనివారం విచారణ ప్రారంభించారు. మెదక్ జిల్లా కలెక్టర్ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. అయితే భూ అక్రమాల్లో అసైన్డ్ భూమి కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్యశాఖను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.