తగ్గుతూ వస్తున్న పసిడి ధర
గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు కూడా తగ్గుముఖం పట్టాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు లేకపోవడంతో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.190 తగ్గి రూ.30,740కి చేరుకుంది. అంతర్జాతీయంగానూ పసిడి ధర 0.73 శాతం తగ్గింది. ఫలితంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1,222.40 డాలర్లకు పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా దిగొచ్చింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలోకు రూ.230 తగ్గింది. ఫలితంగా రూ.40 వేల కిందికి దిగజారి రూ.39,200 పలికింది.