ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని 7 వ వార్డు చిల్కనగర్ లో
ఇంటింటి చెత్త సేకరణలో జిహెచ్ఎంసి సిబ్బంది అలసత్వం వల్ల చెత్త నుండి వచ్చే వాసన తట్టుకోలేకపోతున్నాము అని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే…
కరోనా మహమ్మారి ఉదృతితో తెలంగాణ మొత్తం తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, జిహెచ్ఎంసి సిబ్బందిని ఫ్రేంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించి, రాష్ట్రం మరియు హైదరాబాద్ నగరం మొత్తం గల్లీ గల్లీలో తిరిగి చెత్త చెదారం లేకుండా ఊడ్చేసి, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తూ, ఎలాంటి రోగాలు ప్రబలకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అణువణువు శుభ్రం చేయ్యాలి అని ఆదేశాలు జారీ చేసి, చాలా సీరియస్ గా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గ జిహెచ్ఎంసి సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు..
చిల్కనగర్ నుండి లక్ష్మిస్టార్ట్స్ కంపెనీకి వెళ్లే దారిలో, డెలివరీ కంపెనీకి దగ్గర్లో… రోజు వారిగా ఇంటింటి చెత్త సేకరించటం కోసం, చెత్త సేకరణ బిన్స్ (Garbage collection bins) జిహెచ్ఎంసి సిబ్బంది ఏర్పాటు చేయ్యడం జరిగింది. రూల్స్ ప్రకారం రోజు వారిగా కాలనీల్లో సేకరించిన చెత్తా చెదారం అంతా కలిపి దగ్గర్లో ఉన్న డంపింగ్ యార్డ్ కి పంపించాలి. కానీ అక్కడ ఏర్పాటు చేసిన బిన్స్ నుండి చెత్త తొలగించడంలో జిహెచ్ఎంసి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని స్థానిక కంపెనీ వాళ్లు ఆరోపిస్తున్నారు.

అక్కడి చెత్త , చెదారం తొలగించకపోవడం వల్ల, అక్కడే నివసిస్తున్న కాలనీ వాసులు కూడా అదే బిన్స్ లో చెత్త వేయ్యడంతో, ఆ బిన్స్ పూర్తిగా చెత్తతో నిండిపోతున్నాయి. కొందరైతే అందులో కాళీ లేకపోవడంతో ఆ బిన్స్ ప్రక్కనే నిర్లక్ష్యంగా పడేసి వెళ్లిపోవడంతో వాటి నుండి భరించలేనంత వాసన వస్తుంది. రోడ్డంతా చెత్తతో నిండిపోవడంతో ఆ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులు ఏంటో తెలుసుకునేందుకు స్థానిక ప్రజలను తొలిపలుకు సంప్రదించగా….

ఇంటి ఇంటికి తిరిగి చెత్త సేకరించే జిహెచ్ఎంసి సిబ్బంది వాళ్లు మా కాలనీల్లోకి రోజు రాకపోవడం వల్ల ఇంట్లో చెత్త నిల్వలు పెరిగిపోయి వాటి నుండి వచ్చే దుర్గంధంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆ వాసన మేము భరించలేకపోతున్నాము అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు ఇంట్లో నిల్వ ఉంచే పరిస్థితి లేక తాము రోడ్డు మీద పెట్టిన బిన్స్ లో చెత్త పడేయాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇదే విషయం మీద మేము పలుమార్లు GHMC ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారీ మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వారు ఏమాత్రం పట్టిచుకోవటం లేదు అని వాపోయారు.
ఇప్పటికైనా ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారీ మేడం గారు మా కాలనీ పరిస్థితి అర్థం చేసుకొని, తక్షణమే నిండిపోయిన ఆ బిన్స్ నుండి చెత్తని తొలగించేలా ఆదేశాలు జారీ చేసి, ఇంటి ఇంటికి తిరిగి చెత్త సేకరించే జిహెచ్ఎంసి సిబ్బందిని మందలించి, రోజు వారిగా మా కాలనీల్లో చెత్త సేకరణ సరిగ్గా జరిగేలాగా, మా కాలనీ రోడ్లు మొత్తం శుభ్రంగా ఉండేలా చూడాలని కాలనీ వాసులు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారీ మేడం గారికి విజ్ఞప్తి చేసారు..