జీహెచ్‌ఎంసీ టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను వసూలు
జీహెచ్‌ఎంసీకి మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.1400 కోట్ల ఆస్తిపన్ను కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు సుమారు రూ.1350 కోట్ల వరకు వసూలు చేసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2018-19కు సంబంధించి బకాయిదారులు చెల్లించాల్సిన పన్నును ముందస్తుగా వసూలు చేసుకునేందుకు అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం కూడా మంచి ఫలితాలనిచ్చింది. ఏప్రిల్ నెలాఖరులోపు పన్ను చెల్లించే బకాయిదారులకు ఐదు శాతం రిబేటు ఇవ్వటంతో ఎక్కువ సంఖ్యలో బకాయిదారులు తమ పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ సంవత్సరం ఎర్లీబర్డ్ స్కీం కింద కనీసం రూ.400 కోట్ల మేరకు పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఏప్రిల్ నెలాఖరు రోజు 30న అర్థరాత్రి పనె్నండు గంటల వరకు జరిగిన ఆన్‌లైన్ చెల్లింపులతో కలిపి టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం రూ. 437.75 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు వెల్లడించారు. మొత్తం 532108 మంది ఆస్తిపన్ను చెల్లించగా, వీరిలో 196166 మంది ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు వివరించారు. దేశంలో ఏ ఇతర నగరాల్లో లేని విధంగా ఈ సారి జీహెచ్‌ఎంసీ పన్ను చెల్లింపుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంతవ్సరం ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.362.54 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఈ సారి ఏకంగా రూ.75.21 కోట్ల మేరకు పన్ను ఎక్కువ వసూలైంది.