అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ చర్యలు మొదలయ్యాయి
మహానగరంలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ చర్యలు మొదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అడ్డుకోవాల్సిన అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు వీలుగా తగిన సిబ్బంది, యంత్రాంగం లేకపోవటంతో ప్రభు త్వం ప్రత్యేకంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విపత్తుల నివారణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కం పటి ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనున్న ఈ విభాగానికి అన్ని శాఖల నుంచి అధికారులను నియమించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నా, విభాగం విధులు మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కమిషనర్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో మూడింటిని కమిషనర్ చీఫ్ సిటీ ప్లానర్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ కొం దరు యజమానులు కోర్టును ఆశ్రయించినా, చివరకు కోర్టు వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కేసులను తొలి దశగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్ రెడ్డి తెలిపారు.
జీహెచ్‌ఎంసీ కోర్టు ధిక్కారం కాకుండా ఇదివరకే కోర్టు జారీ చేసిన వందల సంఖ్యలో ఉన్న కూల్చివేత ఉత్తర్వులను అమలు చేస్తూ, అక్రమ నిర్మాణాలను కొనసాగించేందుకు వీలుగా ఈ విభాగాన్ని ప్రస్తుతం వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ విభాగం చర్యలు తీసుకోవాల్సిన అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించి రంగంలోకి దిగాలా? లేదంటే వచ్చిన ఫిర్యాదులను టౌన్‌ప్లానింగ్ విభాగం నిర్దారించుకున్న తర్వాతే ఈ విభాగానికి అప్పగించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ నేరుగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఈ విభాగం స్వీకరించి, చర్యలు తీసుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సాధారణంగా అక్రమ నిర్మాణాలు, ఉన్న నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి సాగే నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఇరుగుపొరుగు వారి మధ్యనే వస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో ఎక్కువ శాతం కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నందున, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో నూటికి నూరు శాతం అక్రమ నిర్మాణమని తేల్చిన తర్వాతే, దాన్ని కూల్చివేసే బాధ్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజల నుంచి కమిషనర్‌కు, సిటీ చీఫ్ ప్లానర్‌కు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, వాటిలో అక్రమ నిర్మాణాలను నిర్దారించుకుని కూల్చివేతల నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగిస్తేనే విజిలెన్స్ విభాగం పనితీరు పారదర్శకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.