గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ ప్రాంతం సిద్దం
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తరలుతున్నారు. హైదరాబాద్ నగరంలోనేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున గణనాథులను నిమజ్జనానికి తీసుకువస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతం రద్దీగా మారింది. భారీ వాహనాల్లో గణేష్ విగ్రహాలను తీసుకువస్తుండడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది. ఇదిలా ఉండగా నిమజ్జనం ప్రాంతాల్లో మొత్తం 27 వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 8వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, అటు పోలీస్ శాఖ సంయుక్త అధ్వర్యంలో నిమజ్జనం ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం చేశారు. భారీ క్రేన్‌పై గణనాథుడిని ఎక్కించారు. అనంతరం నగరంలోని ఆయా ప్రాంతాల్లో శోభాయాత్రను నిర్వహించిన అనంతరం ట్యాంక్‌బండ్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నంలోపే మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా… ట్యాంక్‌బండ్ క్రేన్ నెంబర్- 6 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు.