25 కిలోల గంజాయి స్వాధీనం
3తొలిపలుకు న్యూస్ (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన పోతుగంటి అనిల్ కుమార్, హయత్ నగర్ కు చెందిన ఉతాది జ్ఞానేశ్వర్ అలియాస్ గణేష్ ఇద్దరు మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలోని సైదిరెడ్డి అలియాస్ బబ్బుకు గంజాయి విక్రయిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు వారిని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయి ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో విచారణ చేయగా తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాధ్ అలియాస్ ప్రదీప్, తూర్పు గోదావరి జిల్లా బచ్చులూరు గ్రామానికి చెందిన వేమా జాన్ రెడ్డిలు తమకు విక్రయించినట్లు చెప్పారని, వీరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
గత కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పని చేస్తున్నదని ఆయన తెలిపారు. డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి పర్యవేక్షణలో గంజాయి ముఠాను పట్టుకోవడంలో సమర్ధంగా పని చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు, టాస్క్ ఫోర్స్ సిఐ రౌతు గోపి, ఎస్.ఐ. అంతిరెడ్డి తదితరులను డిఐజి రంగనాధ్ అభినందించారు.