తొలి ‘రోబో పోలీస్’ హైదరాబాదులో
దేశంలోనే తొలి పోలీసురోబోగా పేర్కొంటున్న మరమనిషి విశేషాలివి. నగరానికి చెందిన హెచ్-బాట్స్ రోబొటిక్స్ సంస్థ రూపొందించిన పోలీసు రోబోను శుక్రవారం ట్రైడెంట్ హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పరిశీలించారు.
‘‘గతంలో ప్రకటించిన విధంగా బాంబులను గుర్తించి నిర్వీర్యంచేయడం, స్థానిక భాషలో పలకరించడం, బదులివ్వడం, ప్రజల మధ్యలో తిరగటంలాంటి సేవలు ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం’’అని హెచ్-బాట్స్ రోబొటిక్స్ వ్యవస్థాపకుడు పీఎస్ వీ కిషన్ తెలిపారు. ఈ రోబోను ఈ నెల 31న జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద ప్రజల మధ్యలోపరిశీలించనున్నామని చెప్పారు. అక్కడ గుర్తించిన లోటుపాట్లను విశ్లేషించి మరింత మెరుగుపరు స్తామన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లిషునే గ్రహిస్తుందని, త్వరలో హిందీ, తెలుగు భాషలను జత చేస్తామని తెలిపారు.
ఈ రోబో కోసం పరిశోధన, అభివృద్ధికి కలిపి 40లక్షలు ఖర్చయిందని, రూ.5లక్షలకు అందిస్తామన్నారు. ఈసందర్భంగా థాయ్‌లాండ్‌కు చెందిన హోటళ్ల కంపెనీ ఎమిగోస్, హెచ్-బాట్స్ రోబొటిక్స్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హెచ-బాట్స్ రోబొటిక్స్ ప్రతినిధులు అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) అంజనీ కుమార్‌ను కలిసి పోలీసు రోబో పనితీరును వివరించారు.