ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం పలువురు నటీనటులు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత, యాంకర్, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి తదితరులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు.

అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీవితా రాజశేఖర్ దంపతులు మీడియాలో మాట్లాడారు. నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ…వైఎస్ జగన్ ఇంత బిజీలో కూడా మాకోసం సమయం కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రజల కోసం పని చేస్తున్న జగన్‌కు ఒక అవకాశం ఇవ్వండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి వైఎస్ జగన్ ‘నవరత్నాలు’ ప్రకటించారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వైఎస్ఆర్ తన హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్‌ఆర్ పథకాలనే చంద్రబాబు పేరు మార్చి.. తన ఘనతగా చెప్పుకున్నారు.’ అని అన్నారు.