దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు అవసరం .. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు
‘దేశాన్ని సుభిక్షమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం. అయితే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తి లోపించింది. లౌకిక ధృక్ఫధంతో పాలన సాగడం లేదు. దేశాభివృద్ధి ఆశించిన మేరకు జరగడం లేదు. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన జపాన్‌లాంటి దేశాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నా యి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు అన్ని పార్టీలు, ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నాం. ఈ విషయంలో తమతో ఏకీభవించి కలిసి వచ్చేదెవరు? రానిదేవరు? అనేది రెండు మూడు నెలల్లో తేలిపోతుంది. తర్వాతనే ఫెడరల్ ఫ్రంట్‌పై పూర్తి స్పష్టత, నిర్ణయాలు జరుగుతాయ’ అని తెరాస అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.
ఇప్పటి తమ ప్రయత్నాలు ప్రారంభం కాదు… ముగింపు కాదన్నారు. కాంగ్రెస్, బిజేపీయేతర కూటములకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై వివిధ ప్రాంతీయ పార్టీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస భేటీలు, సమాలోచనలు జరపుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం స్టాలిన్‌తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మంచినీరు వంటి అనేక వౌలిక సమస్యలను కేంద్రం పరిష్కరించలేకపోయిందన్నారు. ఈ అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉండాలి కానీ కేంద్రం తన దగ్గరే ఉంచుకుందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలి.
కేంద్రం వద్ద విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ వంటి కొన్నింటిని పెట్టుకుని మిగతా వాటిపై పూర్తి స్వేచ్ఛ, అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? తదితర అంశాలపై స్టాలిన్‌తో చర్చించామన్నారు. తమ మధ్య సంబంధాలు కొత్తేమి కాదని, యూపీఏ-1 ప్రభుత్వంలో డీఎంకె, తెరాస భాగస్వామ్యంగా ఉన్నాయని కేసీఆర్ గుర్తు చేసారు. దక్షిణాదిలో కరుణానిధి గొప్ప నాయకుడన్నారు. స్టాలిన్‌తో చర్చించిన అంశాలపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించామన్నారు. ఈ విషయంలో తమ తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ చర్చిస్తానన్నారు. చంద్రబాబు తాను మంచి స్నేహితులమని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
తానేప్పుడు థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌ల గురించి మాట్లాడలేదని, మీడియానే అలా రాసిందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావాలన్నదే తమ ప్రయత్నమన్నారు. ఇది ఎలా ఉంటుందన్నది తేలడానికి కొంత వ్యవధి పడుతుందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో 97 శాతం భూరికార్డులను ప్రక్షాళన చేశామన్నారు.
అలాగే రైతులకు సాగు కోసం ఎకరాకు ఎనిమిది వేల చొప్పున నగదు అందించే రైతు బంధు పథకాన్ని వచ్చే నెల 10న ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమానికి స్టాలిన్‌ను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారన్నారు. కరుణానిధి తనకు పసందైన భోజనం పెట్టి మంచి పుస్తకాలు బహూకరించారన్నారు. ఇదిలావుంటే, ఆదివారం రాత్రి కేసీఆర్ బృందం చెన్నైలోనే బస చేసి సోమవారం ఉదయం మరికొందరు నేతలతో సమావేశం కానున్నట్టు తెరాస వర్గాలు తెలిపాయి. చెన్నై పర్యటన సందర్భంగా ఆదివారం సాయంత్రం కపాలేశ్వర దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. కేసీఆర్ వెంట పార్టీ ఎంపీలు కె కేశవరావు, బి వినోద్‌కుమార్, మంత్రి ఈటల రాజేందర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నే ప్రభాకర్ తదితరులున్నారు.