ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంట్ బాయిలర్ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరికొంత మంది ఇంకా ప్లాంట్‌లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎన్టీపీసీ విచారణకు ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఉంచహార్ ప్లాంట్‌లోని 500 మెగావాట్ల ఆరో యూనిట్‌లో బాయిలర్ పైప్ పేలిపోయింది. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ వందలాది మంది ఎన్టీపీసీ కార్మికులు, సీనియర్ అధికారులు, ఇంజనీర్‌లు ఉన్నారు.
ఎన్టీపీసీ ఉంచహార్ ప్లాంట్‌లో మొత్తం 6 యూనిట్లు ఉండగా వాటిలో ఐదింటిని 1988లో ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్ల. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ఆరో యూనిట్‌ను ఈ ఏడాదే
ప్రారంభించారు. దీని సామర్థ్యం 500 మెగావాట్లు. ఈ యూనిట్ ద్వారా గత కొంతకాలంగా సక్రమంగా ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో బుధవారం దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, గాయపడిన వారిలో చాలా మందికి 70 శాతానికి పైగా కాలిన గాయాలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మరోవైపు మారిషస్ పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం 32 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉంచహార్ ప్లాంట్ వద్ద సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే హోంశాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సహా ఉన్నతాధికారులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే లక్నోకు చెందిన కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్య సేవలు అందిస్తోంది.