హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక అంశంపై జాతీయ, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. వర్చువల్‌గా జరిగిన సమావేశంలో నడ్డాతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు మాట్లాడారు. ఈ క్రమంలో ఈటల చేరికకు భాజపా అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీలో ఆయన చేరిక తేదీని రెండు రోజుల్లో భాజపా ఖరారు చేయనుంది. అధిష్ఠానం ప్రకటించిన తర్వాత దిల్లీ వెళ్లనున్న ఈటల.. భాజపా ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరే అవకాశముంది.
కొద్దిరోజులుగా భాజపా కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. దిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.