ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై చందాదారులకు చెల్లించే వడ్డీ రేటులో మార్పేమీ ఉండకపోవచ్చు. ఈ వడ్డీ రేటును ఖరారు చేసేందుకు ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టు బోర్డు సభ్యులు ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నారని, ప్రస్తుతం చెల్లిస్తున్న 8.65 శాతం వడ్డీ రేటును వారు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన లోటును భర్తీ చేసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఈ నెల ఆరంభంలో రూ.2,886 కోట్ల విలువైన ఈటీఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)ను అమ్మినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని దాదాపు 5 కోట్ల మంది చందాదారుల ఈపీఎఫ్ డిపాజిట్లకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించిన ఈపీఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆ వడ్డీ రేటును 8.65 శాతానికి తగ్గించిన విషయం విదితమే.