బ్యాంక్ రుణాల మోసానికి సంబంధించి అహ్మద్ పటేల్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్
సోనియా గాంధీ రాజకీయ సలహాదారు హోదాలో ఒక వెలుగు వెలిగిన అహ్మద్ పటేల్‌కు ఊహించిన సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణాల మోసానికి సంబంధించి ఒక కార్పొరేట్ సంస్థను ఈడీ విచారిస్తున్న సమయంలో.. అహ్మద్ పటేల్, ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖీల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో వీరిపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వడోదర కేంద్రంగా పనిచేస్తున్న సందేశార గ్రూప్ ఆఫ్ సంస్థలు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సందేశార సంస్థల డైరెక్టర్ సునీల్ యాదవ్‌ను విచారించింది. ఈ విచారణలోనే సునీల్ యాదవ్ అహ్మద్ పటేల్ కుటుంబ సభ్యుల పేర్లను ఈడీకి వెల్లడించింనట్లు సమాచారం. సునీల్ ఇచ్చిన లిఖితపూర్వక సాక్ష్యంలో సందేశార గ్రూప్ యజమాని చేతన్ సందేశార, ఆయన సహచరుడు గగన్ ధావన్ భారీ మొత్తంలో సొమ్మును సిద్ధిఖీకి ఇచ్చినట్లు ఆరోపించారు. చేతన్ సందేశార తరపున భారీ నగదును ఫైజల్ పటేల్‌కు పంపించినట్లు తెలిపారు. చేతన్ సందేశార తరచూ అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్ళేవారని కూడా సునీల్ తెలిపారు.
న్యూఢిల్లీలోని 23,మదర్ క్రెసెంట్‌లో అహ్మద్ పటేల్ నివాసం ఉంది. దీనిని సందేశార ప్రస్తావించినపుడు, ‘హెడ్‌క్వార్టర్స్ 23’ అని అభివర్ణించేవారని సునీల్ పేర్కొన్నారు. సిద్ధిఖీని జే2 అని, ఫైజల్‌ను జే1 అని సంబోధించేవారని పేర్కొన్నారు. సునీల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం నమోదు చేశారు. అందువల్ల దీనిని కోర్టులో సాక్ష్యంగా అనుమతిస్తారు.