చలికాలం ప్రారంభంలో.. దసరా-దీపావళి సీజన్లో సీతాఫలాలు విరివిగా లభిస్తాయి. అడవులు, బీడు భూముల్లో, పెరట్లో ఎక్కడైనా సరే ఈ చెట్లు పెరుగుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పల్లెటూళ్లలో పెరిగిన వారు సీతాఫలాలను మగ్గబెట్టుకొని తిన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక లక్కీగా చెట్టు మీద పండిన సీతాఫలం తింటే.. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సేకరించి పట్టణాల్లో రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. కానీ అడవులు తరిగిపోవడం, కోతుల బెడద కారణంగా వీటి రేటు ఎక్కువగా ఉంటోంది.
సీతాఫలంలో పోషక విలువలు అధికం. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలంలో ఐరన్, పాస్ఫరస్, మెగ్రీషియంలతోపాటు విటమిన్-సి సమృద్ధిగా లభిస్తాయి. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 1.6 గ్రాముల కొవ్వు, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, థయమిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్ కూడా ఇందులో ఉంటాయి.
సీతాఫలం తినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి. మలబద్ధం తగ్గుతుంది. ఇవి చలవ చేస్తాయి కాబట్టి సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకల దృఢంగా మారతాయి. కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది. ఇంకేం.. ఈ సీజన్లో రోజుకో సీతాఫలాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.