ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్టు భూకంప నమోదు కేంద్రం పేర్కొంది. కెర్మాన్ ప్రావిన్స్‌లోని హజ్‌డాక్ అనే గ్రామాన్ని భూకంపం తాకినట్టు తెలిపింది. అయితే నష్టం తక్కువగానే ఉందని, హజ్‌డాక్, రావర్‌లో 18 మంది గాయపడ్డారని నేషనల్ ఎమర్జన్సీ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
భూకంప తీవ్రతకు
6 గ్రామాల్లోని పురాతన ఇళ్లు దెబ్బతిన్నాయని, స్కూళ్లు, యూనివర్శిటీలు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. టెహ్రాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలోని కెర్మాన్‌లో భూకంపం చోటుచేసుకోగా, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. మంగళవారం రాత్రి 12.13 గంటలకు ఈ భూకంపం సంభవిచిందన్నారు. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు చెప్పారు. కాగా, తొలుత 5.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, ఆ తర్వాత పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.