వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాడురోపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. శనివారం ఓ మిలిటరీ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్న సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ పేలింది. ఈ దాడి కొలంబియాతోపాటు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం చేసిందని వెనెజులా ఆరోపించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను స్థానిక మీడియా రిలీజ్ చేసింది. మాడురో ప్రసంగిస్తున్న సమయంలో గాల్లో పేలుడు శబ్దం వినిపించడం, మాడురోతోపాటు పక్కనున్నవాళ్లంగా భయపడుతూ పైకి చూడటం వీడియోలో కనిపిస్తుంది. మరోవైపు ఆ పేలుడు శబ్దానికి అక్కడున్న సైనికులతో భయంతో పరుగులు పెట్టారు. అప్పటి వరకు ఈ ఈవెంట్‌ను లైవ్ చూపించగా.. పేలుడు తర్వాత టెలికాస్ట్‌ను ఆపేశారు.
వెనెజులాలో ఆర్థిక సంక్షోభం ముదరడంతో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. కొలంబియా, ఫ్లోరిడాల్లో ఎక్కువ మంది వెనెజులా నుంచి వెళ్లిన వాళ్లు ఉన్నారు. దీంతో వాళ్లే ఈ దాడికి ప్రయత్నించారని వెనెజులా ఆరోపించింది. ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడిన మాడురో.. తర్వాత మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇది నాపై జరిగిన హత్యా ప్రయత్నం అని మాడురో అన్నారు. కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ తనపై దాడి చేయించారని ఆయన వెల్లడించారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఆయన చూపించలేదు. అటు అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాపైనా మాడురో అనుమానం వ్యక్తంచేశారు. అయితే ఆయన ఆరోపణలను కొలంబియా, ఫ్లోరిడా ఖండించాయి.
ఈ దాడి తమ పనేనని నేషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్ అనే గ్రూపు ప్రకటించింది. నిజానికి తాము రెండు డ్రోన్లను పంపినా.. స్నైపర్లు ఒకదానిని మధ్యలోనే పేల్చేశారని ఆ గ్రూపు చెప్పింది. ఈరోజు విఫలమైనా.. ఏదో ఒక రోజు మాడురోను హత్యచేస్తామని స్పష్టంచేసింది. ఈ గ్రూపును 2014లో ప్రతిఘటనల గ్రూపులన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేశారు. ఆరోసారి అధ్యక్ష పదవిలో ఉన్న మాడురోపై దేశంలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లుగా దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.