వకుళాభరణం దారెటు
డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు
డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా?
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
రాష్ట్రంలో బి.సి. ఉద్యమనేతగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఇటీవలి వరకు బి.సి. కమిషన్ ఛైర్మన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయన భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? అనే దిశగా రాజకీయ వర్గాలలో చర్చలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా బి.సి. కమిషన్ ఛైర్మన్‌గా మిక్కిలి క్రియాశీలకంగా ఆయన వ్యవహరించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కులసర్వేకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వంకు సూచించి, ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునేలా వ్యవహారదక్షతను ప్రదర్శించారు. అయితే తన మూడేళ్ల పదవీ కాలం ఆగస్టు 31తో ముగిసింది. అందరూ ఆయనను తిరిగి కమిషన్ ఛైర్మన్‌గా కొనసాగిస్తారని భావించారు. కాగా అందుకు భిన్నంగా రేవంత్ ప్రభుత్వం బి.సి. కమిషన్‌కు కొత్త వారితో పాలకమండలిని నియమించింది. దీంతో వకుళాభరణం తన రాజకీయ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చలతో పాటుగా తమ వైపు వస్తే బాగుండు అనే దిశగా, రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి.
నిబద్ధత కలిగిన బి.సి. నాయకుడిగా, విషయ పరిజ్ఞానిగా, వక్తగా, రచయితగా వకుళాభరణం మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. గతంలో ఆయనను ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వై.యస్.ఆర్. ప్రభుత్వం రెండు పర్యాయాలు బి.సి. కమిషన్ సభ్యుడిగా నియమించింది. ఆయన సేవలను గుర్తించి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో సాధారణ ఎన్నికలలో అవకాశం కల్పించింది. 2010 ఉప ఎన్నికలలో కూడా ఆయననే కాంగ్రెస్ పార్టీ మరో మారు అభ్యర్థిగా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలి బి.సి. కమిషన్‌లో సభ్యుడిగా, రెండవ బి.సి. కమిషన్‌కు ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. సుదీర్ఘకాలంగా బి.సి.ల హక్కులు, ప్రయోజనాల నిమిత్తం విశేషంగా కృషి చేస్తూ తనకంటూ ఆ వర్గాలలో ఒక ప్రత్యేక గుర్తింపును వకుళాభరణం పొందగలిగారు.
గత శాసనసభ ఎన్నికల బరిలో బి.సి. ముఖ్యమంత్రి నినాదంతో బిజెపి నిలిచింది. కామారెడ్డి బి.సి. డిక్లరేషన్‌తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. అభివృద్ధి, సామాజిక న్యాయం నినాదంతో బిఆర్‌ఎస్ ముందుకెళ్లింది. వెరశి అన్ని రాజకీయ పార్టీలు బి.సి.ల నుండి ఓట్లు రాబట్టే దిశగానే ఎన్నికలలో వాగ్ధానాలు, హామీలు ఇచ్చి పోటీపడ్డాయి. కాగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. బిజెపి ఎట్టి పరిస్థితులలోనైనా అధికారంలోకి రావాలి అనే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులను కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీ కలిగిన నేతలను తమ తమ పార్టీలలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే బి.సి. వర్గాలలో పట్టు, పలుకుబడితో పాటు ఆ వర్గాలను ప్రభావితం చేయగలిగిన, నిబద్ధత కలిగిన నాయకుల అవసరం అన్ని పార్టీలకు ఉంది. కాగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు సుపరిచితుడు, వివాదరహితుడుగా, బి.సి. వర్గాలలో పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన వకుళాభరణం తమ పార్టీలో చేరితే సముచితంగా గౌరవిస్తాం అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆయనతో మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వకుళాభరణంను అడిగినప్పుడు, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. తనను కలిసిన సన్నిహితులతో అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుందని అంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.