రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సచివాలయం మీడియా పాయింట్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.
బడుగులకు అండగా నిలబడండి – అడ్డుకాకండి.
42% రిజర్వేషన్ నిర్ణయం చారిత్రక మైలురాయి.
కుట్రల వెనక శక్తులకు ఓటుతో బుద్ధి చెబుతాం.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ – స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందక, విద్య, ఉద్యోగాలు,సామాజిక–ఆర్థిక–రాజకీయ రంగాల్లో వెనుకబడ్డారని గుర్తు చేశారు.
దశాబ్దాల బీసీ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందని, ప్రత్యేక జీవో జారీ చేయడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం అని అన్నారు.
బడుగు–బలహీన వర్గాల అభివృద్ధి కోసం క ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు కులగణన విజయవంతమైందని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులు అసెంబ్లీలో ఆమోదమయ్యాయని కానీ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంచి అడ్డుకోవాలని కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు.
పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285(ఎ) సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ వద్ద పెండింగ్‌లో పెట్టడం బీసీల హక్కులను ఆటంకపరచడమేనని ఖండించారు. బీసీలకు రిజర్వేషన్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నం.9 జారీ చేసిందని, కానీ కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని కుట్రలు రచిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోని 243డి(6), 243టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచే అధికారం ఉందని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, బీసీల వెనకబాటుతనం ఆధారంగా శాస్త్రీయంగా రిజర్వేషన్లు పెంచామని ప్రభుత్వం ఇప్పటికే వివరించిందని గుర్తు చేశారు. అసెంబ్లీకి చట్ట సవరణ చేసే పూర్తి అధికారం ఉందని, బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. తమిళనాడు ఉదాహరణను చూపుతూ, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమని తెలిపారు. చివరిగా, రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకు ప్రజాస్వామ్య ఆయుధం అయిన ఓటుతో బుద్ధి చెబుతామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బీసీ నేతలు, మురళీకృష్ణ బాబా యాదవ్ పాల్గొన్నారు.


