*రోడ్లు భవనాల శాఖకు నిధులు కేటాయిస్తాం*
*రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్ మెంట్ భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలి*
*నంది ఆవార్డుల ప్రధానంపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం*
*ఎఫ్‌డిసి పరిధిలో ఉన్న భూములను సంరక్షణ చేయండి*
*రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాలు, సినమాటోగ్రఫీ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి*
———————–
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖల ఉన్నత అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని. పదిసార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రోడ్డు నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పీపీటీ రూపంలో వివరించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు సంబంధించి ఆలైన్‌మెంట్‌పై చర్చించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఆలైన్‌మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఆలైన్‌మెంట్ ఉండాలని సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, నల్గొండ, హైదరాబాద్ లో కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టడం, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్ యూబీలు, వీయూబీ బ్రిడ్జ్ ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించడం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్ వర్క్ పెంచేందుకు అవసరమున్న నిధులు విడుదల చేయాలని చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో సిఐఆర్ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్ధిక మంత్రి అంగీకారం తెలిపారు. ఇవే కాకుండా చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరముంటుందని, అందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి కోరారు. అనంతరం సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడలని ఉపముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ వంటి మహమ్మారి వ్యసనాల వ్యతిరేఖ ప్రచారంలో సినిమా సెలెబ్రిటీలు పాల్గొనే విధంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. చలన చిత్ర పరిశ్రమ నటీ నటులకు అందజేసేటు వంటి నంది ఆవార్డ్స్ పై క్యాబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయడానికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించాలన్నారు. ఫిలిం డెవలప్‌మెంట్ పరిధిలో హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉన్న భూములు ఆన్యాక్రాంతం కాకుండ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సినిమా టికెట్ల కంటే థియేటర్ లో అమ్మే చిరుతిళ్లకు వందరేట్ల వసూళ్లకు పాల్పడుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అన్ని మెట్రో నగరాల్లో అమలవుతన్న రేట్లకంటే హైదరాబాద్ సినిమాహాల్లలో అమ్ముతున్న రేట్లు వందల శాతం ఎక్కువగా ఉన్నాయని దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఆన్ లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయని వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుందామని కోమటిరెడ్డి అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, రోడ్లు భవనాల శాఖా ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరి హరిత, డిప్యూటి సీఎం సెక్రటరి కృష్ణ భాస్కర్, ఈన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డి, సతీష్ తో పాటు ఐఅండ్ పీఆర్ కమీషనర్ అశోక్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.