పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంను ఐఐటీ ఖరగ్‌పూర్ అతి తక్కువ ఖర్చుతో మహమ్మారికరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లోని కచ్చితత్వం పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంలో ఉందని తెలిపింది.
రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు వైరస్ ఉనికి తెలుసుకుని జాగ్రత్త పడొచ్చునని తెలిపారు. ఈ పోర్టబుల్ పరికరంతో ఎంతోమందికి పరీక్షలు చేయొచ్చునని, ప్రతి టెస్టు తర్వాత ఒక పేపర్ కాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు.
కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఇదొక గొప్ప ప్రగతి అని పరికరం తయారీలో కృషి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, స్కూల్ ఆఫ్ బయో సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అరిందమ్ మోండల్ తెలిపారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో జన్యు విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తుంని తెలిపారు. తమ పరికరానికి సంబంధించిన లేబొరేటరీ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు.