అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం దేశ ప్రధాని మోడీ ఏప్రిల్ 14 అర్ధరాత్రి 12 గంటల నుండి మే 3 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ కొనసాగింపు జరుగుతుందని దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రకటనకు ముందే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ని ఏప్రిల్ 30 వరకు పాటించాలని అనుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి. పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం అంతటా పోలీసులు వైరస్ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడున్న ఆంక్షలు కఠినంగా కొనసాగించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అన్ని ప్రాంతాల్లో సానిటైజేషన్ కి సంబంధించి చర్యలు చేపడతామని సూచించడం జరిగింది. రెడ్ జోన్లు గా ప్రకటించిన ప్రాంతాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అక్కడి ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు కూరగాయలు నేరుగా వారికే సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలంటున్నా ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఈ లాక్ డౌన్ కొనసాగించక తప్పదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మార్కజ్ ఘటన తర్వాత రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతుండటంతో ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితిగా ప్రభుత్వం పేర్కొంది. దీనిని కట్టడి చేయడం కొరకు దయచేసి ప్రజలందరూ ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారు తమ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ ను విధించడం ప్రజలను కరోన మహమ్మారి నుండి కాపాడడానికే తప్ప ప్రజలను కష్టాలకు గురి చెయ్యడానికి కాదని అన్నారు. అయితే లాక్ డౌన్ ద్వారా ఉపాది కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బడుగు బలహీన వర్గాలను, ఆకలితో అలమటించే వారికి పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలి అని సూచించారు. లాక్ డౌన్ ద్వారా వివిధ వర్గాల వారు అనేకమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు రోజువారి ఆదాయం మీద కుటుంబాలు నడిచే చిన్న చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్ లు, పాన్ డబ్బాలు, ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు, బేకరీలు, స్వీట్ షాప్ ల వారు తీవ్ర కష్టాలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఐ.టి. రంగంలోని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, ఓలా మరియు ఊబర్ ల వంటి సంస్థలు ఇలాంటి గడ్డు కాలంలో క్యాబ్ డ్రైవర్లకు కనీసం ఒక నెల వేతనం అడ్వాన్సుగా అయిన సరే ఇచ్చి వారిని ఆదుకోవాలని కుమారస్వామి ఆయా కంపనీలకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఇంటి పని చేసే వాళ్ళు, అడ్డా కూలీలు, లాండ్రీ షాపుల వంటి వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కరోనా వల్ల పేదలు, నిరుపేదలు, దిగువ, మధ్య తరగతి వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఇలాంటి వారిని ఆదుకోవడానికి సంపన్న వ్యక్తులు ఆర్థికంగా స్థిరపడినవారు ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు తమకు చేతనైన సహాయం చేయాలని శ్రీ కుమారస్వామి గారు విజ్ఞప్తి చేసారు.
లాక్ డౌన్ మన మంచికే అయినా బ్రతకడం కష్టంగా మారిన ప్రజల గురించి కుడా ఆలోచించాలన్నారు. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు తగు అవసరాలను తీర్చాలి. నీలోఫర్, కింగ్ కోటి, ఉస్మానియా వంటి ప్రభుత్వాసుపత్రుల దగ్గర రోగులు కనీస అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల టిఫిన్ సెంటర్లు అన్నీ మూసి ఉండడంతో ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చీటికి మాటికి బయటికి వెళ్లే పరిస్థితి లేక తెచ్చుకున్న వస్తువులు సరిపోక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి మనలో ఉండే మానవత్వాన్ని మేల్కొలపాలన్నారు. ప్రభుత్వం చేయగలిగినంత సహకారాన్ని అందిస్తుందని, అయినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం మనం అందరం మానవత్వాన్ని చాటుకోవలసిన తరుణం ఏర్పడిందని, వీరికి మనకు చేతనైన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దిగ్బంధనకు గురిఅయిన రోగుల కుటుంభ సభ్యులకు మంచి నీటిని, ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి తమ వంతు సహాయాన్ని తాము కూడా అందిస్తున్నామని, ఇంకా కృషి చేస్తామని తెలిపారు కుమార స్వామి. ఈలాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చి పోలిసుల పని భారాన్ని పెంచోద్దని, లేనిపోని అపోహలతో స్వంత ఊర్లకు కాలినడకన అయిన పోతామనే వలస కూలీలు దయచేసి వారి ప్రయత్నాలు మానుకొని ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని, ఒకవేళ వారికి రేషన్, కూరగాయలు మొదలైనవి కావాలంటే ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలియజేసారు. చిన్న చిన్న పనులు చేసుకుని పొట్ట నింపుకొనే సామాన్యుల నుండి ఈ రెండు నెలలు అద్దె వసూలు కొరకు ఇబ్బంది పెట్టవద్దని ఇంటి యజమానులకు విజ్ఞప్తి చేసారు. పెద్దలు పిల్లలకు వాహనాలు ఇచ్చి బయటకు పంపవద్దని, పోలీసుల నుండి తప్పించుకోవడానికి మితిమీరిన వేగంతో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని తేలిపారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి తప్ప ప్రజలు వారిపై అనవసర దాడులకు దిగడం మంచిది కాదని ఈమధ్య ఇటు గాంధీ ఆసుపత్రిలో మరియు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన సంఘటనలు విచారకరమని తాను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అలానే కరోనా-స్పెషల్ క్వారంటైన్ ఆసుపత్రులన్నింటిలో వైద్యులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కరోనా ఒక అంతర్జాతీయ విపత్తుగా పరిణమించిన తరుణంలో ప్రజలందరూ ఎన్ని కష్టాలు ఎదురైనా, స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వ ఆదేశానుసారం నుడుచుకొవాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం కుడా ఒకవైపు తాము ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతూనే లాక్ డౌన్ తదనతరం ఆర్ధికంగా పుంజుకోడానికి తగిన పక్కా ప్రణాళికలు రచించుకోవాలని ఇటువంటి జాతీయ విపత్తులు మల్లి ఏమైనా వస్తే తట్టుకునే విధంగా తమ ఆర్ధిక విధానాలను రూపొందించుకోవాలని సూచించారు.