రాజస్థాన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
రాజస్థాన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బిజెపికి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం విశేషం. అదే విధంగా పంచాయితీ సమితి సీట్లలో కూడా కాంగ్రెస్ సింహభాగాన్ని సొంతం చేసుకుంది. 27 సీట్లలో 16 సీట్లను దక్కించుకుంది. బిజెపి 10 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
డిసెంబర్ 17న 19 జిల్లాల్లో ఉన్న 27 పంచాయితీ సమితి ఎన్నికలు, 12 జిల్లాల్లో ఉన్న 14 నగర పాలిక సంస్థ ఎన్నికలు, నాలుగు జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. నేడు ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలు రాజస్థాన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ వంటిదని ఇప్పటికే స్పష్టం అయింది. రాష్ట్రంలో బిజెపికి రోజులు దగ్గర పడుతున్నాయని పలువురు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. బిజెపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని కాంగ్రెస్ నాయకులు సైతం అంటున్నారు.
ఈ ఫలితాలపై రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అల్వార్, అజ్మేర్ పార్లమెంటరీ స్థానాలకు, మండల్‌గర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.